‘బిగ్‌బాస్ 2’ తెలుగు రియాల్టీ షో సందడి షురూ కాబోతోంది. ఈసారి నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా అలరించబోతున్నారు. వెండితెరపై తన సహజమైన నటనతో ఫిదా చేసిన నాని.. బుల్లితెరపై ఇంకెలా కనిపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది.
అయితే జూన్ 10 నుంచి ‘బిగ్‌బాస్ 2’ షో ప్రసారం కాబోతోందని నాని ట్విటర్ వేదికగా తెలిపారు. 100 రోజులు ఈ సీజన్ ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 16 మంది సెలబ్రిటీస్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉండబోతున్నారని తెలిపారు. ప్రత్యేకమైన పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.
బుల్లితెరపై ‘బిగ్‌బాస్’ రియాల్టీ షోకు అత్యంత ప్రజాదరణ లభించింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషల్లో ఈ షోను ప్రసారం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హిందీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ ‘బిగ్‌బాస్’కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.