Rajini's Kaala may not release in Karnataka

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘కాలా’ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కానివ్వబోమని కన్నడ సంఘాలు ప్రకటించాయి. రాష్ట్రంలో ‘కాలా’ సినిమాను విడుదల చెయ్యడానికి వీల్లేదంటూ కన్నడ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో సినిమా డిస్ట్రిబ్యూటర్లు చిత్రాన్ని ప్రదర్శించబోమని స్వచ్ఛందంగా ప్రకటించారు. కర్ణాటకలోని పలు థియేటర్ల యజమానులు కూడా సినిమాను ప్రదర్శించబోమని తెలిపారు.

కావేరీ నదీ జలాల వివాదం విషయంలో రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఫిబ్రవరిలో కావేరీ నదీ జలాల వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రజనీకాంత్‌ అంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడుకు న్యాయబద్ధంగా ఏటా 177.25టీఎంసీలు కేటాయిస్తూ, కర్ణాటకలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా అదనంగా 14.75టీఎంసీల నీటిని ఆ రాష్ట్రం ఉపయోగించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. న్యాయస్థానం తీర్పు నిరాశపరిచిందని, దీని వల్ల రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని, తమిళనాడు ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని రజనీకాంత్‌ కోరారు.

ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఫిలిం ఛాంబర్‌ మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది. కావేరీ జలాల వివాదంపై రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. సినిమాను విడుదల చెయ్యబోమని స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాలా’. పా రంజిత్‌ దర్శకుడు. ధనుష్‌ నిర్మాత.జులై 7న ఈ చిత్రం విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమౌతున్న తరుణంలో కర్ణాటక ఫిలిం ఛాంబర్‌ ఈ నిర్ణయం తీసుకుంది.